
‘రంగస్థలం’.. ఓ జీవన విధానం
యడ్లపాడు: ఓపిక, పట్టుదల, కళపై ప్రేమ ఉంటే రంగస్థలం ఎంత గొప్ప వేదికో తెలుస్తుందని ప్రముఖ నాటక కళాకారిణి లహరి చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య నాటికల పోటీల నిమిత్తం ఆమె యడ్లపాడు విచ్చేశారు. ఎన్నో అవాంతరాలు దాటి రంగస్థలంపై నటనతో తనదైన ముద్ర వేసిన లహరి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నాటకాలు ఆడే వారిపై సమాజంలో చిన్నచూపు తగదని పేర్కొన్నారు. మహిళలు కూడా రాణించే అవకాశం ఉందన్నారు.
ప్రతిభ చాటొచ్చు...
సీ్త్ర పాత్రలకు ఒకప్పుడు పారితోషికాలు సరిగ్గా ఇవ్వలేని స్థితి ఉండేదన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతిభను చాటి నటనకు మరిన్ని మెరుగులు దిద్దుకునే గొప్ప వేదిక రంగస్థలం అన్నారు. దర్శకత్వం కూడా చేసినట్లు చెప్పారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత రంగస్థలాన్ని ఎంచుకున్నట్లు వివరించారు. అదేస్థాయిలో సంపాదన ఆర్జించటమే కాకుండా ప్రజలను చైతన్యపరిచే గొప్ప అవకాశం, అనుభూతి లభించాయన్నారు. కుటుంబ సభ్యుల్లా అందరూ మెలుగుతున్నారని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
కళలకు గొప్ప భవిష్యత్తు ఉందని ఆమె చెప్పారు. ‘ఇప్పుడు రూ.కోట్లు వెచ్చించి సినిమాలు తీసినా, ప్రేక్షకులు ఇది ఏఐతో చేశారేమో అని అనుమానిస్తున్నారని పేర్కొన్నారు. రంగస్థలంపై నటన మాత్రం నవరసాలతో నిండినదన్నారు. ఎలాంటి ఎఫెక్టులు ఉండనందున నేరుగా ప్రేక్షకుల మనసుకు తాకే అవకాశం ఉంటుందని తెలిపారు. నాటకరంగం పట్ల సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన బాధ్యత రచయితలు, మీడియా, ప్రభుత్వంపై ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ రంగంపై ఆసక్తి కలిగిన పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.
అపోహలు వీడి వాస్తవాల్ని కనండి ప్రముఖ నాటక కళాకారిణి లహరి