
దారి మళ్లిన పేదల బియ్యం
బొల్లాపల్లి: పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ బియ్యం మార్గమధ్యలోనే పక్కదారి పడుతున్నాయి. గోదాము నుంచే నేరుగా అక్రమార్కుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులకు తెలిసినప్పటికీ, పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం అక్రమ వ్యాపారం దందా లోగుట్టు అధికారులకే ఎరుక అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం గోదాము నుంచి చౌకధరల దుకాణానికి చేరుకోవలసిన రేషన్ బియ్యం వినుకొండ పట్టణానికి దగ్గరగా ఉన్న ఒక రైస్ మిల్లుకు చేరాయని సమాచారం. ప్రజా పంపిణీ బియ్యం బొల్లాపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన చౌక ధరల డిపోనకు తరలించాల్సి ఉంది. కానీ ఈ బియ్యం మార్గమధ్యలోనే దారి మళ్లించి సమీపంలోని రైస్ మిల్లులకు తరలించారు. గోదాము నుంచి సుమారు 40 క్వింటాళ్లు తరలి వెళ్తున్న రేషన్ బియ్యం కలిసిన టాటా ఏస్ వాహనాన్ని కొందరు వెంబడించారు. పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అక్రమ వ్యాపారులు వారి కన్నుగప్పి వాహనాన్ని దారి మళ్లించి రైస్ మిల్లుకు చేర్చారు. గ్రామానికి చేరుకోవాల్సిన బియ్యం రాకపోవడంతో గమనించిన పలువురు ఈ విషయంపై అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లేదు. అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అండదండలతో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటుకు తరలి వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

దారి మళ్లిన పేదల బియ్యం