
కంది రైతులకు సౌభాగ్యం
కారెంపూడి: గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (లాంఫాం) శాస్త్రవేత్తలు రూపొందించిన నూతన కంది రకం ఎల్‌ఆర్‌జీ 133–33 సౌభాగ్య మంచి దిగుబడుల నిస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో శాస్త్రవేత్తలు డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మోహన్‌రెడ్డి, డాక్టర్ కేవి శివారెడ్డిలు ప్రతి మండలాన్ని దర్శించి సౌభాగ్య నూతన కంది విత్తనాలను ఇచ్చి సాగు చేయాలని రైతులను ప్రోత్సహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చర్లగుడిపాడు, కారెంపూడి, దొనకొండ మండలాల్లో 43 మంది రైతులకు ప్రథమశ్రేణి విత్తన కిట్‌లను పంపిణీ చేశారు. ఆ విత్తనాన్ని నీటి పారుదల కింద సాగు చేసిన రైతులకు పది నుంచి గరిష్టంగా 17 క్వింటాళ్ల దాకా దిగుబడులు వచ్చాయి. రైతులు చాలా కాలం తర్వాత ప్రైవేటు కంపెనీలకు దీటైన విత్తన దిగుబడులు సౌభాగ్య ద్వారా సాధించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విత్తనం రూపకల్పన పూర్వాపరాలపై కథనం.
దక్షిణ భారతానికి అనువైన రకం
ఈ రకాన్ని అప్పటి లాంఫాం అపరాల శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.రాజమణి, డాక్టర్ ఎంవీ రమణ, డాక్టర్ ఎం.శ్రీకాంత్‌లు 2020లో రూపొందించారు. ఈ విత్తనాన్ని క్షేత్ర పరిశీలన చేసిన కాన్పూర్‌లోని జాతీయ కంది పరిశోధనా స్థానం ఈ రకం విత్తనం దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా గుర్తించింది. ఆ తర్వాత నుంచి మన లాంఫాం శాస్త్రవేత్తలు ఈ రకాన్ని తమ పర్యవేక్షణలో సాగు చేస్తూ దిగుబడులు పరిశీలిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత 2023 నుంచి తమ భూముల్లో విత్తేవిధంగా శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో సైతం గత ఖరీఫ్‌లో మండలానికి పది మంది రైతులకు ఉచితంగా విత్తనాలిచ్చి పురుగు మందులు కూడా ఇచ్చిసాగుచేయాలని డాక్టర్ సాంబశివరావు తదితరులు ప్రోత్సహించారు. నీటి పారుదల ఉన్న చోట పంట వేసిన వారికి అంతకు ముందున్న ఫేమస్ వైరెటీల కన్నా అధిక దిగుబడులు రావడం క్షేత్రస్థాయిలో గుర్తించడం జరిగింది.
మంచి దిగుబడులు ఇస్తున్న సౌభాగ్యం రకం కంది విత్తనం నూతన వంగడాన్ని రూపొందించిన లాం ఫాం శాస్త్రవేత్తలు ఇప్పటికే సాగుచేసి అధిక దిగుబడులు సాధించిన రైతులు తెగుళ్లను పూర్తిస్థాయిలో తట్టుకునే రకంగా ప్రసిద్ధి
తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది
ఈ రకం ఎండు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులును పాక్షికంగా తట్టుకుంటుంది. ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో దీనిని సాగు చేయవచ్చు, ఖరీఫ్‌లో అయితే జూన్, జూలైలో రబీలో అక్టోబరులో వేసుకోవచ్చు. ఖరీఫ్‌లో అయితే పెద్ద అచ్చు పెట్టుకోవాలి. రబీలో పత్తి సాగు అచ్చు పెట్టుకోవచ్చు. కాయలు జడలుగా గుత్తులుగా కాస్తాయి. గింజ నాణ్యత బాగుంటుంది. ఆకులు కాయలు ఒకే రంగులో ఉండి కాపు పైకి పెద్దగా కన్పించదు. అయినా దిగుబడి మాత్రం నీటి పారుదల ఉంటే ఎకరాకు పది క్వింటాళ్ల పైనే వస్తుంది.
– డాక్టర్ ఎస్.రాజమణి, విత్తనం
ప్రధాన రూపకర్త

కంది రైతులకు సౌభాగ్యం

కంది రైతులకు సౌభాగ్యం