
అందాల రాముడు
మా ఊరి దేవుడు..
సత్తెనపల్లి: సకల సద్గుణాలకు మారు రూపుగా.. మానవాళికి ఆదర్శంగా..అపురూపమైన బంధాలకు ఆలవాలంగా నిలిచిన శ్రీరాముడు జన్మించిన శుభదినం.. ఆయన సీతారాముడు అయ్యే శుభలగ్నం వెరసి ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా అంతటా రామాలయాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. సీతారాముల కల్యాణ వేళ రానే వచ్చింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సవాల నిర్వహణలో సందడి కనిపిస్తోంది. సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమ్మేళన ప్రతీకను చూడగానే కుటుంబ బాంధవ్యాలు కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. భార్యాభర్తల అన్యోన్యత, అన్నదమ్ముల ఆప్యాయత ఆదర్శ మూర్తిపై విధేయత .. ఇలా కుటుంబంలోని అనేక కోణాలు మానవ జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తాయి. పుణ్య దంపతులకు ప్రతీకగా కొలిచే సీతారాముల వారి కల్యాణం కనువిందుగా నిర్వహించడం ఆచారంగా వస్తుంది. కేవలం రామాలయాలు కాకుండా దాదాపు అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక వేదికలు సిద్ధం
వేసవిలో వచ్చే శ్రీరామనవమి వేడుకలకు ప్రత్యేకత ఉంది. సీతారాముల కల్యాణం పేరిట ఓ శుభకార్యాన్ని బంధుమిత్రులు, ఇరుగుపొరుగులతో కలిసి రెండు గంటలపాటు ఒకే చోట కలిసి ఉండే అపురూపమైన ఈ అవకాశం శ్రీరామనవమి ఇస్తోంది. జిల్లాలో చిన్న, పెద్ద రామాలయాలు, వైష్ణవాలయాలు అన్నిటిల్లోనూ ఉదయం 9 నుంచి 12:30 గంటల లోపు కల్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆయా ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. ఆలయాల్లో కల్యాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులందరికీ కల్యాణ విందు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నేడు శ్రీరామ నవమి పర్వదినం జిల్లాలో కల్యాణోత్సవాలకు ఆలయాలు ముస్తాబు గ్రామాలు, పట్టణాల్లో పండుగ శోభ
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ
క్షేత్రస్థాయిలో ఐక్యతకు ప్రతీక
ఉత్సవాలు నిర్వహణ తరతరాలుగా గ్రామాల ప్రజానీకం మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఆలయాలకు సమీపంలోని గ్రామస్తులంతా కులాలకతీతంగా ఉత్సవ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక గీతాలాపన, భజన, ఏకాహ కళాకారులంతా ఉత్సవ చలువ పందిళ్లలో తమ కళను ప్రదర్శిస్తుంటారు. బెల్లం పానకం, వడపప్పును ప్రసాదంగా పంచుతూ తోటి వారితో ఆప్యాయంగా వ్యవహరిస్తారు.

అందాల రాముడు