
అలరిస్తూ.. ఆలోచింపజేస్తూ..
కొనసాగుతున్న సుందరయ్య కళానిలయం జాతీయస్థాయి నాటికల పోటీలు
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు రెండోరోజైన శనివారం కొనసాగాయి. రెండు రోజులు జరిగిన ఆరు ప్రదర్శనలు బంధాలు, వాటి విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి గురించి వివరించాయి. నాటికలోని ప్రతి సంఘటన సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఆలోచనలను రేకిస్తుంది. ఈ కళారూపాల్ని తిలకించేందుకు కళాభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడం, అర్థరాత్రి వరకు అన్ని ప్రదర్శనల్ని ఎంతో ఆసక్తిగా తిలకించడం విశేషం.
మానవ సంబంధాల్లో శూన్యతను ప్రశ్నించే
‘నా శత్రువు’..
ఆధునిక జీవనశైలిలో టెక్నాలజీ ఆధిపత్యాన్ని కేంద్రంగా తీసుకుని, మానవ సంబంధాల్లో ఎదురవుతున్న శూన్యతను బహిర్గతం చేస్తున్న ఇతివృత్తం ‘నా శత్రువు’ నాటిక. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సోషల్ మీడియా వంటివి సమయాన్ని మింగేస్తూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని ఈ నాటిక స్పష్టంగా చూపిస్తుంది. కుటుంబ సంబంధాలు, అనుబంధాల విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ నాటిక ఒక హెచ్చరికగా నిలుస్తుంది. జయభేరీ థియేటర్స్ హైదరాబాద్ వారు సమర్పించిన ఈ నాటికను అక్కల తామేశ్వరయ్య రచించగా వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
●అదేవిధంగా ఆధునిక ఆడపిల్లల స్వతంత్ర భావనలు వివరిస్తూ.. ఆడపిల్లలు భారం అన్నట్టుగా నమ్మే వక్ర భావజాలాన్ని సూటిగా విమర్శించిన ‘రుతువు లేని కాలం’, ఓ సామాన్య మహిళ రైల్వే శాఖపై సంధించిన అస్త్రంగా సాగిన ‘జనరల్ బోగీలు’ నాటికలు ఆలోచింపజేశాయి.

అలరిస్తూ.. ఆలోచింపజేస్తూ..