
వైభవంగా ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల
నాదెండ్ల: మండలంలోని ఎండుగుంపాలెం గ్రామంలో కొలువైయున్న అక్కాయగుంట సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం, నూజెండ్లపల్లి అమ్మవారి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. దేవస్థాన కమిటీ చైర్మన్ సాగి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆలయ పూజారి వివేక్‌వర్మ ఉదయాన్నే స్వామివారిని అలంకరించి పూజాభిషేకాలు, గోత్రనామ పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇర్లపాడు, ఎండుగుంపాలెం గ్రామం, రాజుపాలెం, బుక్కాపురం, గంగన్నపాలెం మొక్కుబడుల ప్రభలు తరలివచ్చాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఆలయం గ్రామ శివారులో ఉండటంతో దారి పొడవునా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రెండు భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు మజ్జిగ, మంచినీరు, పానకం, వడపప్పుతో పాటూ భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను గ్రామ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పొట్టేళ్లతో బండి కట్టి గ్రామ ప్రభను తరలించటం భక్తులను ఆకట్టుకుంది.

వైభవంగా ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల