
నటనకు మూలం రంగస్థలమే!
యడ్లపాడు: టీవీ, సినిమా, వెబ్‌సిరీస్, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి సాధించినా అన్నింటికీ మూలం రంగస్థలం అన్నది నిజం. అది అనంతమైనది.. అజరామరమైనదని ప్రముఖ సినీ నటుడు అజయ్‌ఘోష్ పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయంలో మూడోరోజు ఆదివారం జరిగిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబుతో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
సామాన్య ప్రేక్షకుడిగానే వచ్చాను..
వెండితెర, బుల్లితెర, ఓటీటీ వంటి విభాగాలెన్ని ఉన్నా అందులో నిలదొక్కుకోవాలంటే నాటకరంగం నుంచి వచ్చిన కళాకారులకే సాధ్యమవుతుందని అజయ్‌ఘోష్ తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు తమ ప్రతిభను చాటి ఆయా పరిశ్రమల్లో రాణించగలుగుతారన్నారు. సుందరయ్య కళానిలయం వారు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినా, తాను మాత్రం వినోదంతో పాటు సందేశాల్ని అందించే పరిషత్ నాటికలను వీక్షించేందుకు వచ్చిన ఓ సామాన్య ప్రేక్షకుడినే వచ్చానని తెలిపారు. నాటక రంగం అంటే తనకెంతో ఇష్టమని, నిరంతరం దానినుంచి చాలా విషయాలను నేర్చుకునేందుకే ఎక్కువగా ఇష్టపడతానని తెలిపారు. ముఖ్యంగా నాటక రచన, అందులోని మాటలు, కళాకారుల నటనా చాతుర్యం తనకెంతో స్ఫూర్తినిస్తాయన్నారు. తాను రంగస్థలంలో నిత్య విద్యార్థినేనని తెలిపారు.
సమాజ మార్పుకోసం కృషి అభినందనీయం..
యడ్లపాడు అభ్యుదయ, కమ్యూనిజం భావజాలం కలిగిన గ్రామమని, సంస్కృతికి కళలే ఆయువు పట్టన్నారు. సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో గత 22 సంవత్సరాలుగా నాటకోత్సవాలను నిర్వహించడం అద్భుతమని కొనియాడారు. వీటి నిర్వహణ కోసం అందరూ సమష్టిగా కృషి చేయడం అభినందనీయమన్నారు. కళాకారులు, రచయితలు, దర్శకులను తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించడం, కళాసేవల్ని అందించిన ప్రముఖుల్ని పురస్కారంతో సత్కరించడం, మహిళా ఆర్టిస్టులకు ఆడపడుచు లాంఛనాలతో సారెనిచ్చి సత్కరించడం పల్లె సంస్కృతికి నిదర్శనమన్నారు. సుదీర్ఘ కాలంగా కళల్ని, కళాకారుల్ని ఇతోధికంగా ప్రోత్సహిస్తూ కళామతల్లి సేవలో తరలిస్తున్న గ్రామస్తులు ప్రశంసనీయులని తెలిపారు.
స్ఫూర్తినిచ్చేవి నాటకాలే... నేర్చుకోవాల్సింది అక్కడే సినీ నటుడు అజయ్‌ఘోష్ యడ్లపాడు జాతీయస్థాయి నాటకోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరు