
ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రైవేటీకరణ మానుకోవాలి
పిడుగురాళ్ల: ఆరోగ్యశ్రీ ట్రస్టును ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీకి సంబంధించి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలలకు రూ.3500 కోట్ల బకాయిలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్టును ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించి వారికి అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందన్నారు. కార్పొరేటు వైద్యులు అడ్వాన్స్‌లు అడగటం లేదని, ముందుగా వైద్యం చేసి ఆ తర్వాత అడుగుతున్నారని, కానీ అవి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
నిర్వీర్యం చేసే కుట్ర
ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మాన్ భారత్ ద్వారా పల్లెలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2019 వరకు 1800 రోగాలకు ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందించే పరిస్థితి ఉండేదని, 2019 తర్వాత మహానేత తనయడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 వేల రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి మరింత బలోపేతం చేశారన్నారు. సంవత్సరానికి రూ.7500 కోట్లు ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ముందస్తుగా ఇచ్చే కంటే రూ. 4 వేల కోట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకి ఇస్తే మెరుగైన వైద్యం రాష్ట్రంలోని పేదలకు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రను కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.
పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందకుండాచేసేందుకు కూటమి కుట్ర ఇప్పటివరకు రూ.3,500 కోట్ల బకాయిలు బీమా కంపెనీలకు ఏడాదికి రూ.7500 కోట్లు ముందుగా చెల్లిస్తామనటంలో మర్మమేంటి? వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్