
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేక కలెక్టర్ గాయత్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ కుముదిని, ఏఓ లీలా సంజీవకుమారి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 152 అర్జీలను స్వీకరించారు. వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పదేళ్ల నుంచి పింఛను కోసం తిరుగుతున్నాను..
నేను పుట్టుకతో దివ్యాంగురాలిని. నాకు వివాహమైంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. భర్త చనిపోయాడు. సొంత ఇల్లులేదు, గజం స్థలం లేదు. నివాసం ఉండేందుకు ఇల్లులేక పట్టలతో గూడు ఏర్పాటుచేసుకొని ఉంటున్నా. 2014లో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సదరన్ క్యాంపులో డాక్టర్లు నన్ను పరీక్షించి 73శాతం వికలాంగత్వం ఉన్నట్లుగా నిర్ధారిస్తూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ద్వారా దివ్వాంగ పింఛన్‌కోసం పలుమార్లు దరఖాస్తు చేశా. కలెక్టరేట్‌కు ఆరేడుసార్లు వచ్చా. ఇప్పటివరకు పింఛన్ మంజూరు చేయలేదు. దయచేసి ఇప్పటికై నా నాకు పింఛన్ మంజూరు చేయండి.
– ముద్దా అప్పమ్మ, పెదగార్లపాడు, దాచేపల్లి మండలం
పీజీఆర్‌ఎస్‌కు 152 అర్జీలు స్వీకరించిన ప్రత్యేక కలెక్టర్‌గాయత్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ కుముదిని
పరిష్కరించకుండానే సంతకాలు చేయమంటున్నారు
స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని ఆవులసత్రం పక్కనే ఉన్న కత్తవ కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాం. దీనిపై ఆక్రమణలు తొలగించాలంటూ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే అధికారులు ఆక్రమణలు తొలగించకుండానే ఆ సమస్య పరిష్కారమైనట్లుగా సంతకాలు చేయాలంటూ మాపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికై నా ఆక్రమణలు తొలగించి కత్తవ కాలువను కాపాడండి.
– పీడీఎం నాయకులు, నరసరావుపేట