
ఉత్తమ ప్రదర్శన నాన్న నేనొచ్చేస్తా
● ముగిసిన జాతీయస్థాయి నాటికల పోటీలు ● ఈనెల 4వ తేదీ నుంచి 6వరకు పది నాటికలు ప్రదర్శన
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం నిర్వహించిన 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎంవీ చౌదరి కళావేదిక ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు 10 నాటికలు ప్రదర్శించారు. ప్రతిరోజూ పండుగలా నిర్వహించిన ఈ పోటీలకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. కళాభిమానులు మూడు రోజులు అర్థరాత్రి వరకు ఉంటూ కళారూపాల్ని ఆద్యంతం తిలకించి ఆస్వాదించారు. నిత్యం ప్రేక్షకులకు వెయ్యి మందికి అల్పాహారం అందించడం, ప్రతిరోజూ 30 మంది చొప్పున 90 మందికి లక్కీడ్రా తీసి బహుమతుల్ని అందించారు. 15 మంది న్యాయనిర్ణేతలు, దాతలు, కళాకారులు, అతిథులు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు జ్ఞాపికలు అందించి సత్కరించారు. ముత్తవరపు సురేష్‌బాబు సతీమణి ముత్తవరపు అరుణకుమారి లేడీ ఆర్టిస్టులను ఆడపడుచు లాంఛనాలిచ్చి సత్కరించారు.
● జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో అమృతలహరి థియేటర్ (గుంటూరు)వారి ‘‘నాన్న నేనొచ్చేస్తా’’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా యువభేరి థియేటర్స్(హైదరాబాద్) వారి ‘నా శత్రువు’ నాటిక, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్(కొలకలూరి) వారి ‘జనరల్ బోగీలు’ నాటిక నిలిచాయి.
వ్యక్తిగత అవార్డులు
ఉత్తమ రచయిత తాకాబత్తుని వెంకటేశ్వరరావు, ఉత్తమ దర్శకులు అమృత, లహరి, ఉత్తమ ఆహార్యం (నాన్న నేనొచ్చేస్తా), ఉత్తమ సంగీత దర్శకులు (నా శత్రువు), ఉత్తమ రంగాలంకరణ (చిరుగు మేఘం), ఉత్తమ నటీనటులు..సోమిశెట్టి అమృతవర్షిణి( నాన్న నేనొచ్చేస్తా), కావూరి సత్యనారాయణ(చిగురు మేఘం), సురభి ప్రభావతి(జనరల్ బోగీలు), గంగోత్రి సాయి (విడాకులు కావాలి), జ్యోతిరాణి (నాశత్రువు), ఉత్తమ సహాయనటులు...ఎన్.వెంకటేశ్వర్లు (కిడ్నాప్), వసంత యామిని(విడాకులు కావాలి), నాగరాణి (చిగురు మేఘం), సునయన (నా శత్రువు), వడ్దా సత్యనారాయణ(నా శత్రువు), జ్యూరీ అవార్డ్స్ మాస్టర్ మదన్(కిడ్నాప్), బేబి వర్షిణి (నా శత్రువు)లు అందుకున్నారు. కార్యక్రమంలో నాటక పరిషత్ ఉపాధ్యక్షుడు జరుగుల శంకరరావు, కార్యదర్శి ముత్తవరపు రామారావు, కోశాధికారి నూతలపాటి మాధవరావు, కాళిదాసు, ఎం.పద్మారావు పాల్గొన్నారు.