
విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్‌మెన్ మృతి
బెల్లంకొండ: నూతన వీధిలైట్లు అమర్చేందుకు విద్యుత్ స్తంభంపై ఎక్కగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన ఘటన మండలంలోని నందిరాజుపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పాపాయపాలెం గ్రామానికి చెందిన మర్రి నరసింహారెడ్డి (35) మండలంలోని మాచయపాలెం గ్రామంలో గ్రేడ్–2 జూనియర్ లైన్‌మెన్‌గా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా నందిరాజుపాలెం గ్రామంలో నూతన వీధిలైట్లు వేసేందుకు తోటి సిబ్బంది రమ్మని కోరడంతో వారితో కలిసి వెళ్లాడు. కాగా విద్యుత్ లైట్లు అమర్చేక్రమంలో చేతిలో ఉన్న ఇనుప రాడ్డు విద్యుత్ స్తంభంపై 11కేవీ విద్యుత్ వైర్‌కు తగలడంతో షాక్ కొట్టింది. విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలుకాగా, విద్యుత్ స్తంభంపై నుంచి నరసింహారెడ్డి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి మృతితో పాపాయిపాలెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.