
జిల్లా వైద్యశాలలో పర్యటించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్భన్: తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం కాయకల్ప బృందం పర్యటించింది. మంగళగిరిలోని నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు డాక్టర్ నిర్మలగ్లోరి, డాక్టర్ స్టెఫిగ్రేస్‌లు తల్లీపిల్లల వైద్యశాలలోని పలు వార్డులు, ఆపరేషన్ ఽథియేటర్, జిల్లా వైద్యశాలలోని పలు వార్డులు, ల్యాబ్‌లను పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ నిర్మల గ్లోరి మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా తెనాలి రావటం జరిగిందన్నారు. ఆస్పత్రిలో నిబంధనలకు అనుగుణంగా రోగులకు సేవలు అందింస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో శానిటేషన్ బాగోకపోతే ఇన్‌పెక్షన్ సోకే అవకాశం ఉంటుందన్నారు. దానిపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు వివరించారు. జిల్లా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. రోగులకు అందించే సేవలు సంతృప్తికరంగా ఉన్నట్లు రోగులు తెలిపారన్నారు. వారి వెంట వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఆర్‌ఎంవో డాక్టర్ మల్లికార్జునరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, పలువురు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.