
స్ఫూర్తిదాయకం.. కేఎస్ సామాజిక దృక్పథం
పట్నంబజారు: సామాజిక స్ఫూర్తితో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు, పలువురు మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు కలిసి బుధవారం బృందావన్ గార్డెన్స్‌లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సత్కార సభ నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యావేత్త.. అనేక కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు అందించిన మేధావిగా కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన సామాజిక ఉద్యమకారుడు అని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ నిరాడంబరత, సమయపాలనకు ఆయన పెట్టింది పేరని, సామాజిక ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషిని వీడియోల రూపంలో భద్రపరిస్తే భావితరాలకు అది ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు వి.లక్ష్మణరెడ్డి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ఆయన సేవలను కొనియాడారు. స్పందించిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ముందుకు సాగుతూ సమస్యలపై పోరాడేందుకు ముందు నిలబడడం తనకు అలవాటుగా మారిందని వివరించారు. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన అన్ని ప్రజోపయోగ పోరాటాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి గోరంట్ల వెంకట్రావు, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనుంజయరెడ్డి, సీపీఎం నేత భారవి, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు డీఏఆర్ సుబ్రహ్మణ్యం, ముత్యం పాల్గొన్నారు.