
ఐక్య పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం
ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్
చిలకలూరిపేట: ఐక్యపోరాటాలతోనే రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కాలువకు రూ. 5 వేల కోట్ల నిధులు కేటాయించి ఆధునికీకరించాలని కోరారు. వ్యవసాయానికి సాగునీటిని కల్పించడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. మిర్చి క్వింటా రూ. 20 వేలకు తగ్గకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
● నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు మాట్లాడుతూ నల్లబర్లీ పొగాకును టుబాకో బోర్డు పరిధిలో చేర్చి గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ప్రస్తుతం రైతాంగం వద్ద ఉన్న బర్లీ పొగాకును ప్రభుత్వ సంస్థల ద్వారా గత ఏడాది ధరకు తగ్గకుండా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.రాధాకృష్ణ మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాల్వలైన మేజర్లను పొడిగించి నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట, బల్లికురవ, యద్దనపూడి, పర్చూరు, పెదనందిపాడు మండల్లోని గ్రామాల్లో ప్రజానీకానికి తాగునీరు, సాగునీరు అందించవచ్చన్నారు.
● సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రవహించే కుప్పగంజి, నక్కవాగు, ఓగేరు వాగులను శుభ్రం చేయించి, ఆధునికీకరించాలని, కరకట్టలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, ఏపీ మహిళా సమఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, వీసీకే పార్టీ నాయకులు వంజా ముత్తయ్య, నాయకులు కందిమళ్ల వెంకటేశ్వర్లు,నాగేశ్వరావు,మల్లికార్జున్, సృజన్ , కొండల్ రావు, తుబాటి సుభాని తదితరులు పాల్గొన్నారు.