
నేటి నుంచి కృపా మహాసభలు
గుంటూరురూరల్: క్రీస్తు నామాన్ని ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తాడని కృపా మినిస్ట్రీస్ అధ్యక్షుడు బ్రదర్ మాథ్యూస్ తెలిపారు. బుధవారం నల్లపాడు రోడ్డులో ప్రతిఏటా నిర్వహించే కృపా మహాసభల ప్రాంగణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 19వ కృపా మహాసభలను గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఎదురు రోడ్డులో నల్లపాడు రోడ్డునందు ఈ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఆదివారం సాయంత్రం వరకూ ఈ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీస్తుని భక్తులు లక్షలాదిగా పాల్గొంటారన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు పగటిపూట ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాలం కావున విశ్వాసులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చినవారికి భోజన వసతి, మరుగుదొడ్లు, ప్రత్యేకంగా మినిస్ట్రీస్ వలంటీర్‌ల రక్షణలో భద్రత ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతాయని, రాత్రి ప్రార్థనలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మినిస్ట్రీస్ సేవకులు, బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు
లక్షలాదిగా హాజరుకానున్న విశ్వాసులు