
గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం
సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వంట గ్యాస్ రూ.50, పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులునాయక్ డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఆంజనేయనాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు సిలిండర్‌పై రూ.200, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఓట్లు వేయించుకొని మూడవసారి అధికారం చేపట్టి, అనంతరం ఇచ్చిన మాట తప్పారన్నారు. దశల వారీగా గ్యాస్ ధరలు పెంచుతూ రాయితీలు ఎత్తివేశారని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్న నరేంద్రమోదీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత గ్యాస్ అంటూ ఊదరగొట్టినా అనేక షరతులు విధిస్తోందన్నారు. దీంతో ఉచిత గ్యాస్ అందకుండా పోతుందన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, టి.పెద్దిరాజు, నాయకులు కామినేని రామారావు, సయ్యద్ రబ్బాని, షేక్ మస్తాన్‌వలీ, డి.సుభాష్‌చంద్రబోస్, షేక్ ఖాసీం, మిరపకాయల రాంబాబు పాల్గొన్నారు.