
సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరక్టర్ పి.ఝాన్సీరాణి తెలిపారు. కోటప్పకొండలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో బుధవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఝాన్సీరాణి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సీ్త్రనిధి రుణాల లక్ష్యం రూ.120కోట్లు కాగా రూ.47కోట్లు రుణాలు మాత్రమే అందించినట్టు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు అందించడంలో బెల్లంకొండ, శావల్యాపురం, చిలకలూరిపేట, నకరికల్లు, రొంపిచర్ల, నాదెండ్ల, ముప్పాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి, నూజెండ్ల మండలాలు మందు వరుసలో ఉన్నాయన్నారు. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు అవసరమైన జీవనోపాధి రుణాలను స్వల్పకాలిక, మైక్రో, ట్రైనీగా వర్గీకరణ చేసి అందిస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 48 గంటల్లో జీవనోపాధి రుణాలను సాంకేతిక పరిజ్ఞానంతో అందజేస్తున్నట్టు వివరించారు.
నాలుగు గ్రేడ్‌లుగా
వర్గీకరించి రుణాలు..
సీ్త్రనిధి జీవనోపాధి రుణాలను గరిష్టంగా రూ.లక్ష వరకు 36నెలల వాయిదాలతో 11శాతం వడ్డీ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘానికి రూ.5లక్షల వరకు గ్రూపులోని సభ్యులు మైక్రో రుణాలు పొందవచ్చని లేదా ఐదు మంది సభ్యుల వరకు రూ.5లక్షల వరకు ట్రైనీ రుణాలు పొందవచ్చని తెలిపారు. ఏ గ్రేడ్ ఉన్న గ్రూపునకు రూ.75లక్షలు, బి గ్రేడ్‌కు రూ.65లక్షలు, సి గ్రేడ్‌కు రూ.55లక్షలు, డి గ్రేడ్ గ్రూపునకు రూ.45లక్షలు రుణాలు కేటాయించినట్టు తెలిపారు. సీ్త్రనిధి రుణాల రికవరిపై సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి