
సమాజ హితమే సాహిత్యం పరమావధి
తాడేపల్లి రూరల్: మాతృ భాషలు మృత భాషలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఏ ప్రాంత సంస్కృతి పరిరక్షించబడాలన్నా ఆ ప్రాంత భాష ముందుగా రక్షింపబడాలని తెలిపారు. వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో బీఏ (ఐఎఎస్) విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు, వాదాలు – సమాలోచన’’ అనే అంశంపై ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్యం పరమావధి అని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారుల భద్రతా విభాగం డీఐజీ సీహెచ్. విజయారావు మాట్లాడుతూ మాతృభాషలో సివిల్ సర్వీసెస్ రాసి లక్ష్యాన్ని సాధించడం సులువని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ ప్రచురించిన 11 సంవత్సరాల యూపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు – సమాధానాలు, విశ్లేషణతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించి, ఉచితంగా విద్యార్థులకు అందజేశారు. వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ డి. రాంబాబు మాట్లాడుతూ తెలుగు ప్రధాన అంశంగా తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత మార్గ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర లయోలా విశ్రాంత వైస్ ప్రిన్సిపాల్ గుమ్మా సాంబశివరావు, రచయిత్రి నైనాల వాణిశ్రీ , బీఏ విభాగాధిపతి బి. శివనాగయ్య, సహాయ ఆచార్యులు అద్దంకి ప్రజాపతి, వర్సిటీ వీసీ జి. పార్థసారథివర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, కె. రాజశేఖరరావు, ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ కె. సుబ్బారావు, బీఏ ఉప విభాగాధిపతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సమాజ హితమే సాహిత్యం పరమావధి