
ఆదర్శ పాఠశాలలో ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష
జెట్టిపాలెం (రెంటచింతల): జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్ స్కూల్)లో 2025–26 విద్యాసంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకున్న వారికి ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కె. పాపయ్య తెలిపారు. గురువారం ఆయన పాఠశాలలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. ఏప్రిల్ 20న జరగవలసిన ప్రవేశ పరీక్ష ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానిక పాఠశాలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు సెల్ నంబర్ 91829 58496 ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు.
జాతీయ అవార్డుకు విద్యాశాఖాధికారి ఎంపిక
పెదకూరపాడు: పెదకూరపాడు అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఏకుల ప్రసాదరావు ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు’కు ఎంపికై నట్లు సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య గురువారం తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రసాదరావు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు. ఈ నెల 13వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావును పలువురు ఉపాధ్యాయులు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు అభినందించారు.
బావిలో పడి మహిళ మృతి
నకరికల్లు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడడంతో వివాహిత మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని చల్లగుండ్ల గ్రామం సమీపంలో చీరాల ఓడరేవు రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల గ్రామానికి చెందిన షేక్ నాగుల్‌మీరా, షేక్ రమీజా (25) దంపతులు. వీరు తమ ఏడు నెలల పాపను తీసుకొని రమీజా పుట్టిల్లు అయిన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శుభకార్యానికి వచ్చారు. బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ముప్పాళ్లకు తిరుగు పయనమయ్యారు. చల్లగుండ్ల సమీపంలో రోడ్డుపై అడ్డంగా పాము రావడంతో బెదిరిపోయిన రమీజా తన భర్త నాగుల్‌మీరా చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ముగ్గురూ రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. వారి కేకలకు రోడ్డుపై వెళ్లేవారు గమనించి ముగ్గురిని వెలికితీశారు. అప్పటికే రమీజా ఊపిరాడక మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.

ఆదర్శ పాఠశాలలో ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష

ఆదర్శ పాఠశాలలో ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష