
లింగారావుపాలెంలో ‘నాటికల’ పండుగ
యడ్లపాడు: ఆ పల్లె కళలకు నిలయం. కళలతోనే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమని అక్కడి ప్రజలు నమ్మారు. అందుకే కళలకు జీవం పోశారు. రెండున్నర దశాబ్దాల కిందటే కొండవీడు కళా పరిషత్‌ను నెలకొల్పారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెం వాసుల ప్రత్యేకత ఇది. పరిషత్‌కు గౌరవ అధ్యక్షుడిగా సినీనటులు పోసాని కృష్ణమురళి, అధ్యక్షుడిగా కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులుగా తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, కార్యదర్శిగా మండెపూడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కోశాధికారులుగా కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు ఉల్లయ్య, జరుగుల రామారావు ఉన్నారు. 1997లో స్థాపించిన ఈ పరిషత్ ఏటా మూడు రోజులపాటు సామూహిక కళా ఉత్సవాలను నిర్వహిస్తోంది. కరోనా కాలంలో మినహా ఇవి కొనసాగాయి. ప్రస్తుతం 26వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఏప్రిల్ 12,13,14వ తేదీల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది 9 నాటికలు ప్రదర్శితం కానున్నాయి. ఎందరో రాజులు, రారాజులు పరిపాలించిన తెలుగు వారి వైభవానికి నిలువెత్తు సాక్ష్యమైన అద్దంకి రెడ్డి రాజుల రెండో రాజధాని ‘కొండవీటి గిరిదుర్గం’ ఈ గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉంది. తమ కలాన్ని హలంగా చేసి సాహితీ క్షేత్ర స్థానాన్ని సస్యశ్యామలం చేసిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు, ప్రజాకవి వేమన, శ్రీకృష్ణదేవరాయలు ఈనేలపై నడయాడినవారే. కాకతీయులు, రెడ్డిరాజుల పాలనలో సంగీత, సాహిత్య, శిల్పకళల్లో తెలుగు తేజాన్ని అంబరానికి చేర్చిన అవని కొండవీడు. కాబట్టే ఈ పరిషత్‌కు ఆ పేరును పెట్టారు. నాటికల పోటీలతోపాటు కొండవీడు కీర్తిని వ్యాపింపజేస్తున్నారు.
రేపటి నుంచి జాతీయ స్థాయి పోటీలు
అభిమానులకు 3 రోజులపాటు
కళావిందు