
ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
పర్చూరు(చినగంజాం): ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలురాదా ఎడ్ల బలప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇసుక బస్తాలతో ఉన్న చక్రాలు తిరగని ఎడ్ల బండిని నిర్ణీత సమయంలో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. విజయం సాధించిన ఎడ్ల జతలకు వరుసగా రూ 50 వేలు, రూ 40 వేలు, రూ 30 వేలు, రూ 20 వేలు బహుమతులుంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి రోజు సీనియర్స్ విభాగంలో తొమ్మిది ఎడ్ల జతలు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.