సత్తెనపల్లి: గుర్తు తెలియని యువకుడి మృతదేహం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల సమీపంలోని వాగులో శుక్రవారం వెలుగు చూసింది. సుమారు 40–45 సంవత్సరాలు వయసు కలిగిన యువకుడు శరీరంపై వంకాయ రంగు తెలుపు నలుపు చారల టీ షర్టు, దానిపై నీలం రంగు నిండు చేతులు చొక్కా ధరించి, నిక్కర్‌తో ఉన్నాడు. మృతుడి కుడి చేతిపై శిలువ గుర్తు పచ్చబొట్టు ఉంది. కుడి చేతికి నల్లని దారం, తెల్ల పూసలతో కాశీ దారం వలే కట్టి ఉంది.
మృతుడు ఎత్తు 5.6తో చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. స్థానికుల నుంచి సమాచారం రావడంతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వాగులో నుంచి బయటికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. గుర్తు పట్టని విధంగా ఎవరైనా హత్య చేసి పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ 9440796231, సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ 801999643 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.