
పూలే గొప్ప సంఘ సంస్కర్త
నివాళులు అర్పించిన
అదనపు ఎస్పీ సంతోష్
నరసరావుపేట: మహాత్మా జ్యోతీరావు పూలే 18వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్తని జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఏఆర్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
వ్యక్తిపై కత్తితో దాడి
క్రోసూరు: మండలంలోని హసనాబాద్‌లో ఇంటి ఎదురుగా ఉంటున్న వ్యక్తిపై దాడి చేసి, దుర్భాషలాడాడన్న ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసినట్లు క్రోసూరు సీఐ పి.సురేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యర్రంశెట్టి గోపాలకృష్ణ అలియాస్ కిట్టు మద్యం తాగి ఇంటి ఎదురుగా ఉంటున్న మాతంగి వెంకటేశ్వరరావు కసువు ఊడుస్తున్న క్రమంలో గొడవ పడి, దుర్భాషలాడాడు. కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో వెంకటేశ్వరరావు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అట్రాసిటీస్ కేసు నమోదు చేశామని, సత్తెనపల్లి డీఎస్పీ దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 589 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మినట్టు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 423 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10,225, గరిష్ట ధర రూ.12,225, మోడల్ ధర రూ.11,550 పలికింది. కాయలు 166,బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10.400, గరిష్ట ధర రూ.11,800, మోడల్ ధర రూ.11,550 పలికింది. మొత్తం 441.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.
యార్డులో 1,27,104 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,15,943 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,104 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,600 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,603 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.