
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింల ర్యాలీ
క్రోసూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ క్రోసూరులో శుక్రవారం ముస్లింలు భారీగా ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. అమరావతి బస్టాండ్ సెంటర్ నుంచి నాలుగు రోడ్ల వరకు ముస్లిం మహిళలు, పురుషులు కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలైనా అర్పిస్తాం– వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తాం, మాకొద్దు, మాకొద్దు – వక్ఫ్ సవరణ బిల్లు మాకొద్దు, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉందని తెలిపారు. దేశంలో బీజేపీ పాలన చూస్తే మైనార్టీలపై అణచివేత ధోరణి కనిపిస్తోందని, హిందువుల పరిరక్షణ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో క్రైస్తవుల ఎండోమెంట్ ఆస్తులపై స్వాధీన చట్టాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమం హిందూ, ముస్లింల వివాదం కాదని మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసమని అంతా తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముఫ్తిఖలీల్, ముఫ్తి జమాలుద్దీన్, ఫ్యాన్సీ ఖాదర్, షేక్ అబ్దుల్ ఖాదర్, గఫూర్, కమాల్ బాషా, షేక్ సత్తార్, షేక్ మూసా పాల్గొన్నారు.