పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల రూరల్: ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కోసం ఇచ్చిన హామీలను అమలు చేయక కూటమి నేతలు కుట్రలు పన్నుతూ, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాజీ సీఎం వైఎస్. జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అలవిగాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక, ప్రజల సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తున్న జగన్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన లావు కృష్ణదేవరాయలుకు రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేకపోయినా, యువకులను పోత్రహించాలన్న ఉద్దేశంతో తమ నాయకుడు జగన్ ఆ రోజు మొదటి సారిగా ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చి భారీ మెజార్టీతో గెలిపించినట్లు గుర్తు చేశారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కే కృష్ణదేవరాయల దుర్బుద్ధి ఇప్పుడు బయట పడిందిని తెలిపారు. కృష్ణ దేవరాయలు ఎంపీగా గెలిచారంటే అది జగన్, పల్నాడు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల గొప్పతనమేనని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్‌పై ఉన్న కేసుల గురించి అమిత్‌షా వద్ద కృష్ణదేవరాయలు ప్రస్తావించటమంటే అది ఆయన అజ్ఞానమని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌లో కృష్ణదేవరాయలు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అప్పులపాలవుతుంటే వారిని ఆదుకోవడంలో ఎంపీగా విఫలమైన కృష్ణదేవరాయలు వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన అసమర్థత తెలుపుతుందని పిన్నెల్లి విమర్శించారు.