
సంఘ సంస్కరణలకు ఆద్యుడు జ్యోతీరావు పూలే
నరసరావుపేట: సంఘ సంస్కరణలకు ఆద్యుడు జ్యోతీరావు పూలే అని జిల్లా కలెక్టర్ పి.అరుణబాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతీరావు పూలే జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
రూ.51కోట్ల సబ్సిడీతో రుణాల మంజూరు లక్ష్యం
బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో 2107 మందికి సుమారు రూ.51కోట్ల సబ్సిడీతో రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో బీసీలకు 1136 మందికి రూ.22.99కోట్లు, 461మంది కాపులకు రూ.15.48కోట్లు, 63 మంది ఈబీసీలకు రూ.1.66కోట్లు, 204మంది కమ్మకులానికి రూ.5.35కోట్లు, 142మంది రెడ్డి కులానికి చెందిన వారికి రూ.3.71కోట్లు, ఆర్యవైశ్యులు 66 మందికి రూ.1.71కోట్లు, క్షత్రియ కులానికి సంబంధించి ముగ్గురికి రూ.7లక్షలు, బ్రాహ్మణ కులానికి సంబంధించి 32 మందికి రూ.93 లక్షలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ మహాత్ముల జీవిత చరిత్రలు అంతా చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు. 400 మందికి 50శాతం సబ్సిడీతో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.13 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందచేశారు. జిల్లా రెవెన్యూ అధ్యికారి ఏకా మురళి, డివిజినల్ అధికారి కె.మధులత, వెనుకబడిన తరగతుల శాఖాధికారి శివనాగేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు బాదుగున్నల శ్రీను, మల్లికార్జునరావు, చంద్రశేఖర్, నరసింహారావు, షేక్ మాబు పాల్గొన్నారు. తొలుత పల్నాడు రోడ్డులోని మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కలసి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
కార్యాలయంలో నివాళులు అర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే బీసీలకు రూ.13కోట్ల మెగా రుణ చెక్కు పంపిణీ