
అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
నివాళులు అర్పించిన కలెక్టర్, ఎమ్మెల్సీ జంగా, ప్రభుత్వ విప్ జీవీ, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
నరసరావుపేట: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన జీవితాన్ని పణంగా పెట్టి ఎదిగిన వ్యక్తి అని, వారి జీవితం, చరిత్ర స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కొనియాడారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నారు. భారతీయులందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవనం గడపడానికి ఓకే కారణం రాజ్యాంగమేనన్నారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళ వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సివిల్ పనులకు సంబంధించి నిధులు అందాయని తెలిపారు. రాబోయే రోజులలో జిల్లా అధికారులు నెలలో ఒకరోజు సంక్షేమ వసతి గృహాలలో పర్యటించి విద్యార్థిని విద్యార్థులతో కలిసిమెలిసి వారి సాధక బాధలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి నాలుగో శనివారం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెనన్స్ నిర్వహిస్తున్నామని, దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. యూపీఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న విధంగానే ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న వారికి కూడా ఉచిత శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ విభిన్న కులాలు, జాతులు కలిగిన దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మనది అన్నారు. ప్రభుత్వ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగ సృష్ట్కిర్త, రాజ్యాంగవేత్త, సంఘ సంస్కర్త, జాతీయ ముద్దుబిడ్డ అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైందని కొనియాడారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ అంబేద్కర్ పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తుందన్నారు. ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన అంత గొప్ప వ్యక్తులు కావాలని విద్యార్థులకు సూచించారు. ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చే రాజ్యాంగం సృషష్టికర్త కావడం గొప్ప విషయం అన్నారు. అంబేడ్కర్ జీవితచరిత్ర పుస్తకాన్ని జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి శివనాగేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు అరవిందబాబుతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ర్యాలీలో పాల్గొన్నారు.