
హత్యాచారం కేసును నీరుగార్చిన పోలీసులు
వినుకొండ: మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెంలో చింతలదేవి అనే వివాహిత హత్యాచారం కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలకు బహిరంగ లేఖ రాశారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ... వివాహితపై హత్యాచారం కేసును పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా సెక్షను పెట్టి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. ఇటీవల పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో హత్యగా భావిస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హమన్నారు. జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులకు దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడే వారిపై కేసులు పెట్టి నోరు నొక్కడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. న్యాయం కోసం వివాహిత భర్త పోలీసుల వద్దకు వెళ్తే ఆయనపైనే హత్య కేసు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని, అండగా ఉంటామని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి
న్యాయం చేయండి
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
డిమాండ్
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి
బహిరంగ లేఖ