
ఉపాధి హమీ కూలీ మృతి
బల్లికురవ: ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా ఎండ వేడిమితో అనారోగ్యం పాలై పదిరోజులపాటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని కొండాయపాలెం గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసరావు (45) పదిరోజుల కిందట గ్రామంలో జరిగిన ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రెక్కాడితేకాని డొక్క నిండని ఈ కుటుంబంలో యజమాని చనిపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాసరావు అకాల మరణంతో కొండాయపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.