
విచారణ ఎదుర్కోవాల్సిందే
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ఆ సీఐ ఎప్పుడూ వివాదాల్లోనే మునిగి తేలుతుంటాడు. గతంలో ఒక స్టేషన్‌లో పని చేసినప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను చావబాది అనేక ఆరోపణలు ఎదుర్కొని హైకోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసే వరకు వివాదం వెళ్లింది. అక్కడి నుంచి అదే నియోజకవర్గంలోని మరో స్టేషన్‌కు బదిలీ అయినా తీరుమారలేదు. అక్కడా ఇంతే... ఏకంగా ఆయన వేధింపులపై కోర్టులో స్టేట్ మెంట్ రికార్డ్ చేశారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నా రూటే సపరేట్ అంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయటమే లక్ష్యం అంటూ ఆ సీఐ పనిచేస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించటం ఆయన నైజం. పైకి ఖాకీ యూనిఫాం వేసుకున్న లోపల మాత్రం పసుపు చొక్కా ధరించిన పచ్చ కార్యకర్తలాగా పని చేస్తుంటారు. తీసుకునేది ప్రభుత్వ జీతమే కానీ ఆయన పని చేసేది మాత్రం అధికారపార్టీ నేతల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలను స్టేషన్‌కి కూడా రావొద్దని బహిరంగానే చెప్పి తన స్వామిభక్తిని చాటుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ భాస్కరరావు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిత్యం వివాదాలతో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.
సొంత స్టేషన్‌కు బేడీలు వేసిన ఘనుడు
దాచేపల్లి వచ్చినా భాస్కర్ తీరులో ఆవగింజంత మార్పు కూడా లేదు. మీడియానూ స్టేషన్ కు రానివ్వడం లేదంటే భాస్కర్ ఎంత బరితెగించారో అర్థమవుతోంది. ఎవరైనా స్టేషన్‌కు వెళ్లాలంటే వణికిపోతున్నారు. దీంతోపాటుగా భాస్కర్‌పై ఆర్థిక వ్యవహారాల విషయాల్లో అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో వరుస కథనాలు వస్తున్నా ఆయనపై చర్యలు మాత్రం శూన్యం. తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కృష్ణవేణి బంధువులతోపాటు ఆమె న్యాయవాదులు కలవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్లోకి ఎవరూ రాకూడదని సీఐ భాస్కర్ ఆదేశించారు. దీంతో సిబ్బంది పోలీస్ స్టేషన్ గేట్లు వేసి తాళం బదులు బేడీలు వేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు బేడీలు వేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బేడీల భాస్కర్‌గా సీఐ గుర్తింపు పొందారు. ఇంత జరిగినా పోలీస్ ఉన్నతాధికారులు స్టేషన్‌కు బేడీలు వేయడమేంటని కూడా ప్రశ్నించలేదు. స్టేషన్‌లో ఉన్న కృష్ణవేణిని కలవడానికి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు చేయించుకుంటే కానీ సీఐ భాస్కర్ ఒప్పుకోలేదంటే ఆయన వ్యవహారం ఎలా ఉందో అర్థమవుతోంది. అరెస్ట్ చేసిన కృష్ణవేణిని గురజాల కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కృష్ణవేణి సీఐపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్టు ఆమె న్యాయవాదులు చెబుతున్నారు. మానసికంగా తీవ్రంగా హింసించారని కృష్ణవేణి చెప్పినట్టు తెలుస్తోంది. మేం చెప్పినట్లు వినకపోతే రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతాయని, ఆ కేసుల్లో రాష్ట్రం మొత్తం తిప్పుతామని బెదిరించినట్లు న్యాయమూర్తికి కృష్ణవేణి వాంగ్మూలం ఇచ్చినట్టు న్యాయవాదులు చెబుతున్నారు. అంతే కాదు తాను చెప్పింది చెయ్యకపోతే కృష్ణవేణి భర్త రాజ్ కుమార్‌పై గంజాయి కేసు పెడతామని కూడా సీఐ బెదిరించినట్లు న్యాయమూర్తి ఎదుట బాధితురాలు కన్నీరుమున్నీరైనట్టు సమాచారం. దీంతో కృష్ణవేణి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేసినట్టు ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు. సీఐ భాస్కర్‌పై చార్జి మెమో జారీ చేసి, దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
హైకోర్టులోనూ కేసులు
వివాదాల సీఐ
రెడ్‌బుక్ అమలుకు అడ్డదారులు
దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కరరావు దౌర్జన్యాలు అనంతం
వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులే టార్గెట్ గా అక్రమ కేసులు, వేధింపులు
ప్రైవేటు కేసులు వేసిన బాధితులు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి విషయంలోనూ అదే తీరు
ఆమెను పరామర్శించేందుకు ఎవరూ రాకుండా పోలీసు స్టేషన్ గేట్‌కు బేడీలు
గురజాల మేజిస్ట్రేట్ ముందు సీఐకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన కృష్ణవేణి
పచ్చ పార్టీ నేతల మద్దతుతో అవినీతిలో రెచ్చిపోతున్న ఖాకీ
దాచేపల్లి సీఐ భాస్కరరావు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. సొంత స్టేషన్‌కే బేడీలు వేసిన సీఐని నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. రెడ్‌బుక్ అమలు చేయటమే సీఐ భాస్కరరావు చేస్తున్న ఉద్యోగం. వచ్చే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఐ భాస్కరరావుపై విచారణ తప్పక జరుగుతుంది. అన్నిటికీ ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
– కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా పచ్చనేతల అడుగులకు మడుగులు ఒత్తుతూ.. వైఎస్సార్‌సీపీ నేతలను గ్రామాల్లో ఉండకుండా చేస్తున్న సీఐ భాస్కరరావు వ్యవహరశైలి పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చగా ఉంది. సీఐ భాస్కరరావు చేతిలో దెబ్బలు తిన్న.. బెదిరింపులకు గురైన వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనపై హైకోర్టులో కేసులు వేశారు. గురజాల, దాచేపల్లికి చెందిన నేతలు ఆయనపై మూడు కేసులు హైకోర్టులో వేశారు. సీఐ భాస్కరరావు బారినుంచి తమను కాపాడాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. ఆయన అవినీతిపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే మీడియాలోనూ ఆయన అవినీతిపై వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయంటే ఆయన వ్యవహారశైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయినా సదరు సీఐపై చర్యలకు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడంలేదని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి.

విచారణ ఎదుర్కోవాల్సిందే