
ముందే మూసినా.. కిక్కురుమనరు!
చిలకలూరిపేట: మద్యం సిండికేట్లు మరోమారు వైన్‌షాపుల వేళలు కుదించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఆరు వైన్‌షాపులు, పురపాలక సంఘంలో విలీన గ్రామం గణపవరంతో కలిపి 11 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఆరు వైన్‌షాపులు, 10 బార్ షాపుల వారు సిండికేట్‌గా వ్యవహరిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇంకేముంది వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. బార్‌షాపుల్లో కన్నా వైన్‌షాపుల్లో మద్యం రేట్లు తక్కువగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. వైన్ షాపుల కన్నా బార్‌షాపుల్లో క్వార్టర్‌కు రూ. 50 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. వైన్ షాపులు మూసివేయాల్సిన సమయం రాత్రి 10 గంటలు కాగా, బార్ షాపులు రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. ఈ క్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ల వారు, వైన్ షాపుల యజమానులు గత మార్చిలోనే సిండికేట్‌గా ఏర్పడి వైన్‌షాపుల సమయం రాత్రి 10 నుంచి 9గంటలకు అనధికారికంగా తగ్గించారు. ఈ విషయమై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో కొద్దిరోజులు వెనకడుగు వేసిన మద్యం సిండికేట్లు మళ్లీ చెలరేగుతున్నారు.
పట్టించుకోని అధికారులు
గత మూడు రోజుల నుంచి తిరిగి రాత్రి 9గంటలకే వైన్ షాపులు మూసివేస్తున్నా, నిబంధనలు అమలు పరచాల్సిన ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైన్‌షాపుల్లో మద్యం సేవించేందుకు అనుమతులు లేకున్నా దర్జాగా అనధికార పర్మిట్ రూములు ఏర్పాటు చేసి మద్యం తాగిస్తున్నారు. దుకాణదారులంతా అధికారపార్టీకే చెందిన వారు కావడంతో వారికి అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. రాత్రిళ్లు వైన్‌షాపుల సమయం అధికారికంగా తగ్గించటంతో గతిలేని పరిస్థితుల్లో బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లి అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని మందుబాబులు వాపోతున్నారు.
వారు ఆడిందే ఆట...
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆటగా మద్యం వ్యవహారం నడుస్తోంది. చిలకలూరిపేట పట్టణ పరిధిలో మూడు బార్ అండ్ రెస్టారెంట్లను సత్తెనపల్లికి చెందిన ఓ మద్యం వ్యాపారి నిర్వహించేవాడు. గత ఏడాది జూలైలో ఈ మూడు షాపులపై కొందరు అధికార పార్టీ నాయకులు తమకు 50శాతం వాటా ఇవ్వాలని దౌర్జన్యానికి దిగడంతో దిక్కులేని పరిస్థితుల్లో మద్యం వ్యాపారి మూడు దుకాణాలను మూసివేసి, నష్టానికి షాపులను విక్రయించుకొని వెళ్లి పోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఎవరివో లాభాల కోసం నిబంధనలకు విరుద్దంగా వైన్‌షాపులు సమయం కన్నా ముందు మూసివేయడం సరికాదని మందుబాబులు విమర్శిస్తున్నారు.
చిలకలూరిపేటలో వైన్‌షాపులను గంట ముందే మూసివేస్తున్న వైనం పట్టించుకోని అధికారులు