
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
డీఎఫ్‌ఓ శ్రీధర్‌బాబు
దాచేపల్లి: వేసవిలో అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌ఓ) పి.శ్రీధర్‌బాబు కోరారు. మండలంలోని గామాలపాడు సాగర్ సిమెంట్స్‌లో అగ్నిమాపకాలు – వాటి నివారణపై కార్మికులకు సోమవారం అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎఫ్‌ఓ మాట్లాడుతూ.. పనిచేసే చోట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, పని చేసే ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఎప్పుడు పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, భవనాలు, లిఫ్ట్‌లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మెట్ల మార్గాలను ఉపయోగించాలని సూచించారు. పరిశ్రమల్లో పచ్చదనం పెంపుదల కోసం చెట్లను ఎక్కువగా పెంచుతారని, వేసవిలో చెట్లు కొంతమేర ఎండిపోవటం వలన అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని వివరించారు. పరిశ్రమల్లో విద్యుత్ ఉపకరణాల పనితీరును తరచుగా పర్యవేక్షించాలని, చమురు లీకేజీలు గుర్తించి అగ్నిప్రమాదాలు జరగకుండ ముందస్తుగానే నివారించాలని చెప్పారు. అనంతరం కార్మికులు, విద్యార్థులకు వ్యాచరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, అధికారులు నరేందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, నాగేశ్వరరావు, వీరప్రకాష్, నాగభూషణం, నరసింహులు, భరత్‌భూషణ్, రామకృష్ణ, మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.