
అకాల వర్షం .. పొగాకు రైతుకు తీవ్ర నష్టం
కన్నీటి పర్యంతమవుతున్న రైతులు
పెదకూరపాడు: ఆరుకాలం శ్రమించి సాగుచేసి పండించిన పంట చేతికి అందేలోపు జారిపోయింది. అపార నష్టం మిగిల్చింది. రైతుల కంట కన్నీరు మిగిల్చింది. పెదకూరపాడు నియోజకవర్గంలో 300 ఎకరాల్లో సాగు చేసిన పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెదకూరపాడు మండలంలో ఈ ఏడాది పొగాకును గణనీయంగా సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షంతో సుమారు 30 ఎకరాల్లో పంట, దిగుబడులు తడిచిపోవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
తగలబెడుతున్న వైనం..
పెదకూరపాడుకు చెందిన షేక్ యాసిన్ అనే రైతు ఆరు ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ఓ పొగాకు కంపెనీవారు టన్ను రూ.1.08లక్షలకు బేరం ఆడి వెళ్లారు. పంట కంపెనీకి తరలించేందుకు వారం రోజుల ముందు పంటపొలంలోనే పొగాకును ఆరబెట్టారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షంతో పొగాకు తడిసి, ముద్దయి.. అనంతరం మెత్తబడింది. రెండు రోజుల్లోనే నల్లగా రంగుమారి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంటను చూసి రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దిగుబడి అయిన నలుగు టన్నులతో పాటు పంట పొలంలో ఉన్న నాలుగు టన్నుల పంట కూడా తడిచి చీకి పోవడంతో కంపెనీ వారు కొనుగోలు చేయడం లేదని, మొత్తం రూ.10 లక్షల వరకు నష్టం రావండతో పొగాకును కాల్చివేశసినట్లు యాసిన్ తెలిపారు.