
వేగవంతంగా మాదిపాడు బ్రిడ్జి నిర్మాణం
అచ్చంపేట: మండల సరిహద్దులోని మాదిపాడు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై వంతెన నిర్మాణ ఆవశ్యకతను గుర్తించిన అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అభ్యర్థన మేరకు 2023 జూన్ 12న నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మాదిపాడు నుంచి ముక్త్యాలవరకు కృష్ణానదిపై 600 మీటర్ల పొడవు, 12మీటర్ల వెడల్పు, 14 పిల్లర్లతో వంతెన నిర్మాణం చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం కృష్ణానదిలో రెండు పిల్లర్లకు అవసరమైన ఐరన్ బిగించి, బీములను భూమి లెవెల్ వరకు పోశారు.
బ్రిడ్జి నిర్మాణానికి 13.45 ఎకరాల భూ సేకరణ
వంతెనకు సంబంధించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే 13.45 ఎకరాల భూమిని సేకరించారు. ఇందుకుగాను రూ.60.50 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేయించారు. పల్నాడు జిల్లా మాదిపాడు వైపు 4.45 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాలవైపు 9 ఎకరాల భూమిని సేకరించారు. బ్రిడ్జి పొడవు 450మీటర్లు కాగా, వెడల్పు 12మీటర్లు. ముక్త్యాలవైపు కిలోమీటరు, మాదిపాడు వైపు అరకిలోమీటరు రోడ్డు వేయనున్నారు. కృష్ణానదిపై 14 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన
13.45 ఎకరాలు భూసేకరణ చేసి రూ.60.50 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వం