
కష్టపడ్డారు.. కలలు నెరవేర్చుకున్నారు
సివిల్స్‌లో 797వ ర్యాంకు సాధించిన సత్తెనపల్లికి చెందిన పెండెం ప్రత్యూష్
సత్తెనపల్లి: లక్ష్యం, కృషి, పట్టుదల, ప్రణాళిక ఉంటే అపురూప విజయం సాధ్యమవుతుందని పేద కుటుంబానికి చెందిన విద్యార్థి నిరూపించారు. అందుబాటులోని వనరులను వినియోగించుకొని సివిల్స్ విజేతగా నిలిచారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన పెండెం ప్రత్యూష్. సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరిలో ప్రత్యూష్ 797వ ర్యాంకు సాధించారు. సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ప్రత్యూష్ బాల్యం నుంచి ఎంతో ఇష్టంతో చదివారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ విజేతగా నిలిచి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని 31వ వార్డు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పెండెం బాబురావు, యనమాల పద్మ దంపతుల కుమారుడు ప్రత్యూష్. తండ్రి పెండెం బాబురావు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తల్లి యనమాల పద్మ గృహిణి. ప్రత్యూష్ రెండు పర్యాయాలు ప్రయత్నించి, మూడవసారి కసితో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరిలో జాతీయస్థాయిలో 797వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రత్యూష్ సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివి, టెన్త్‌లో 9.7 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్‌లో 970 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యనభ్యశించాడు. 2023–24 ఆంత్రోపాలజీ ఆప్షన్‌గా తీసుకొని ఓ పక్క వైద్యుడిగా వైద్య సేవలు అందిస్తూనే మరో పక్క సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించాడు.
చదువుకు పేదరికం అడ్డం కాదు
చదువుకు పేదరికం అడ్డం కాదు. విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యం పెట్టుకోవాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి. ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా పట్టుదలతో చదివితే ఖచ్ఛితంగా విజయం సాధించవచ్చు.
– పెండెం ప్రత్యూష్, సివిల్స్ ర్యాంకర్