
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నరసరావుపేటటౌన్: హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ హైమారావు తెలిపారు. మంగళవారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. బరంపేటకు చెందిన నాగమ్మకు, అమె అల్లుడు ఆకుల కిషోర్‌కు మధ్య ఆస్తి వివాదం ఉంది. గుంటూరులో నివాసం ఉండే కిషోర్ మద్యం సేవించి తరుచూ వచ్చిపోతూ ఆస్తి పంచటంలేదంటూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. నాగమ్మ గృహంలో అద్దెకు ఉండే గోపిదేశి వెంకటేష్(30) చూసి అనేకమార్లు కిషోర్‌తో గొడవ వద్దని వారించాడు. తన అత్తకు సపోర్ట్‌గా వెంకటేష్ వస్తున్నాడని కక్ష పెంచుకున్న ఆకుల కిషోర్ ఈ నెల 18వ తేదీన ఇంట్లో ఉన్న వెంకటేష్‌పై కర్రతో దాడికి పాల్పడ్డాడు. సంఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతూ 20వ తేదీ వెంకటేష్ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడు ఆకుల కిషోర్‌పై ఇప్పటికే గుంటూరులో ఎనిమిది దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉందని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ అశోక్, ఎస్‌ఐ లేఖ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.