
ప్రాథమిక విద్య మా గ్రామంలోనే కొనసాగించాలి
అచ్చంపేట: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తమ గ్రామంలోనే నిర్వహించాలని, పాఠశాలను పక్కగ్రామాలకు తరలిస్తే తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మండలంలోని ఓర్వకల్లు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లలు తమ గ్రామంలోనే చదువుకోవాలంటూ నినాదాలు చేశారు. ఓర్వకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు వరకు ఉండేవి. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి 1,2 తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి 3,4,5 తరగతుల వారిని పక్క గ్రామమైన రుద్రవరానికి మార్చారు. దీంతో ప్రాథమిక విద్య మొత్తం తమ గ్రామంలోనే నిర్వహించాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ధర్నా చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్, డీఈఓ, ప్రజాప్రతినిధులు జోక్యంచేసుకుని తమకు న్యాయం చేయాలంటూ మొర పెట్టుకున్నారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తం చేసిన ఓర్వకల్లు గ్రామస్తులు