
ఐపీ పెట్టిన బంగారం వ్యాపారి
పిడుగురాళ్ల: వ్యాపారులకు బంగారం బిస్కెట్ ఎరగా చూపించి సుమారు రూ. 150 కోట్లకు మోసగించిన పెరుమాళ్ల రాజేష్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావటం, హవాలాలో డబ్బులు ఉన్నాయని, రాగానే ఇస్తానని చెప్పటంతో బాధితులు కొంత కాలం ఆగారు. తీరా ఇప్పుడు ఐపీ నోటీసులు చేతికి రావటంతో అందరు లబోదిబోమంటున్నారు. బిస్కెట్ వ్యాపారి పెరుమాళ్ల రాజేష్ ఈ నెల 12వ తేదీన ఐపీ నోటీసులను వ్యాపారులకు పంపించారు. సుమారు 63 మంది వ్యాపారులకు ఇవి అందించినట్లు సమాచారం. రాజేష్‌కు దుబాయిలో బిస్కెట్ సిండికేట్‌తో సంబంధం లేదని, విజయవాడలో కొనుగోలు చేసి పథకం ప్రకారం తక్కువ ధరకు బిస్కెట్‌లు ఇచ్చి పెద్ద మొత్తంలో వసూలు చేశాడని సమాచారం.
హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
నరసరావుపేటటౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిని హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితుడు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరం గ్రామానికి చెందిన వడితే నాగేశ్వరరావు నాయక్ కు జీవిత ఖైదు, పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ గురువారం తీర్పు వెలువరించారు. హతుడు షేక్ ఖాదర్ బాబా(32) నిందితుడు నాగేశ్వరావు నాయక్ లది ఒకే గ్రామం. ఖాదర్ బాబా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో చికెన్ షాపు నిర్వహిస్తూ జీవిస్తుంటాడు. ఈ నేపథ్యంలో మురికిపూడికి చెందిన ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉంటున్నాడు. సదరు మహిళతో నిందితుడు నాగేశ్వరరావునాయక్ కూడా గతంలో సన్నిహితంగా మెలిగాడు. సదరు మహిళతో ఖాదర్ బాబా పరిచయం అయిన పిదప ఆమె నిందితుడు నాగేశ్వరరావునాయక్ ను దూరంగా పెట్టింది. కక్ష పెంచుకొని 2019 జులై 23వ తేదీ రాత్రి సమయంలో మురికిపూడి గ్రామంలో చికెన్ షాప్ లో నిద్రిస్తున్న ఖాదర్ బాబాను నాగేశ్వరరావు కత్తితో మెడ భాగంలో నరికి హతమార్చాడు. ఈ మేరకు మృతుడి భార్య షేక్ షాహిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది. ప్రాసిక్యూషన్ ఏపీపీ దేశి రెడ్డి మల్లారెడ్డి నిర్వహించారు.