
వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటిరెడ్డి
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తియ్యగూర కోటిరెడ్డిని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా సాదం
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సాదం వెంకటసత్యనారాయణను పార్టీ జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వైద్య కళాశాలలో స్పోర్ట్స్ డే
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు స్పోర్ట్స్ డే సందర్భంగా గురువారం పలు క్రీడలను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ లాంచనంగా ప్రారంభించారు. వారం రోజులపాటు జరుగనున్న క్రీడల్లో క్రికెట్, షటిల్, చెస్, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ జరుగనున్నాయి. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు క్రీడలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, స్పోర్ట్స్ పీఈటీ రాము, డాక్టర్‌భరత్, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి కేసులో నిందితులకు మూడేళ్ల జైలు
గుంటూరు లీగల్: చందోలు పోలీసులు 2017లో నమోదు చేసిన కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్. ఔ. సత్యవతి బుధవారం తీర్పు వెలువరించారు. బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.కోటేశ్వరరావుకు చందోలు గ్రామం రసూల్ పేటలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో తన సిబ్బందితో దాడి చేశారు. గంజాయి విక్రయిస్తున్న షైక్ నజీర్ బాషా, కొనుగోలు చేస్తున్న చుండూరు మండలం దుండిపాలెంకు చెందిన మారెడ్డి రోహిత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 520 గ్రాముల గంజాయి, రూ. వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారు. నజీర్ బాషా ప్రకాశం జిల్లా తిమ్మాసముద్రానికి చెందిన కర్ణం సుబ్బారావు వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తేలడంతో సుబ్బారావు నుంచి 4,050 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ పూర్తిచేసి నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపించారు.