
దూరవిద్యలో ఉత్తీర్ణత దూరం
గుంటూరు ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారి కోసం ప్రవేశపెట్టిన దూర విద్యా విధానం సుదూరంగా పోతోంది. సమాజంలో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రవేశపెట్టిన దూర విద్య లక్ష్యానికి చేరలేక పోతోంది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) ద్వారా టెన్త్, ఇంటర్‌లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించి, వారికి చదువుకునే అవకాశాలను కల్పించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. బుధవారం రెగ్యులర్ టెన్త్ ఫలితాలతో పాటు ప్రకటించిన దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లాలో దారుణమైన ఫలితాలు నమోదయ్యాయి.
ఫలితాల్లో చతికిలపడిన జిల్లా
రెగ్యులర్ టెన్త్ ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా దూరవిద్య టెన్త్ ఫలితాల్లో చతికిలపడింది. 5.86 శాతం ఉత్తీర్ణతతో జిల్లా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. పరీక్షలు రాసిన 939 మంది అభ్యర్థుల్లో కేవలం 55 మందే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రస్థాయిలో దూరవిద్య టెన్త్ ఫలితాల్లో 37.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో పడిపోయింది.
సొసైటీ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ఉత్తీర్ణత
దూరవిద్య టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పడిపోవడం వెనుక ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వాకమే కారణంగా కనిపిస్తోంది. కోర్సులో చేరిన అభ్యర్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంలో విఫలమైన అధికారులు, ఉత్తీర్ణతా శాతం దిగజారిపోవడానికి కారకులుగా నిలిచారు. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాలు మినహా, మిగిలిన 20 జిల్లాల్లోనూ ఉత్తీర్ణత కూడా గణనీయంగా పడిపోయింది.
గుంటూరు జిల్లాలో 5.86 శాతం నమోదు దూరవిద్య టెన్త్ పరీక్షలు రాసిన 939 మంది అభ్యర్థుల్లో ఉత్తీర్ణులైన వారు కేవలం 55 మంది ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వాకంతో దారుణంగా పడిపోయిన ఉత్తీర్ణత కోర్సులో చేరిన అభ్యర్థులకు సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు పంపిణీలో తీవ్ర జాప్యంతో తప్పిన విద్యార్థులు
సకాలంలో అందని మెటీరియల్
గుంటూరు కేంద్రంగా ఉన్న ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కార్యాలయం ద్వారా టెన్త్, ఇంటర్‌లో చేరిన అభ్యర్థులకు సకాలంలో మెటీరియల్ అందలేదు. 2024–25 విద్యా సంవత్సరంలో గతేడాది డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందలేదు. ఒకవైపు మార్చిలో జరగనున్న పరీక్షలకు ఫీజులు వసూలు చేసిన ఓపెన్ స్కూల్ సొసైటీ తాపీగా పోస్టాఫీసులకు మెటీరియల్ పంపి, చేతులు దులుపుకుంది. గతేడాది డిసెంబరులో గుంటూరు చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో జిల్లాలకు పంపేందుకు గుట్టలుగా పడవేసిన మెటీరియల్ పార్శిళ్లు వెలుగు చూశాయి. గతంలో దూరవిద్య టెన్త్, ఇంటర్లో ప్రవేశం పొందిన అభ్యర్థులకు అక్కడికక్కడే పాఠ్య పుస్తకాలు అందజేసే విధానాన్ని అధికారులు రద్దు చేశారు. రాష్ట్ర కార్యాలయం నుంచి పోస్టల్ ద్వారా పుస్తకాలు పంపే విధానాన్ని ప్రవేశపెట్టడంతో పంపిణీలో నెలకొన్న జాప్యంతో అభ్యర్థులకు శాపంగా మారింది.