
ఉప సభాపతి రఘురామ వ్యాఖ్యలు అనుచితం
సీపీఎం సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్
నరసరావుపేట: కార్మిక, కర్షక, పీడిత వర్గ ప్రజల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వాలకు ఉన్నతమైన సూచనలు చేస్తూ నిస్వార్థంగా ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పార్టీ నరసరావుపేట మండల సర్వసభ్య సమావేశం పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ అధ్యక్షతన నిర్వహించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉపసభాపతి స్థానానికి రఘురామకృష్ణంరాజు అనర్హుడన్నారు. బ్యాంకులు నుంచి రూ.600కోట్లకు పైగా రుణాలు పొంది ఎగ్గొట్టిన ఆర్థిక ఉగ్రవాది అంటూ ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీసుకొచ్చిన నాలుగు లేబరు కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర దాడి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని ఆరోపించారు. అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎ.వి.కె దుర్గారావు, డి.శివకుమారి, కె.పి.జి. మెటిల్డాదేవి, షేక్ సిలార్ మసూద్, టి. పెద్దిరాజు, కట్టా కోటేశ్వరరావు, బి. సలీం, సుభాష్ చంద్రబోస్, కె. రామారావు, షేక్ మస్తాన్ వలి, కె.నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.