
డీఎస్సీపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలి
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న
లక్ష్మీపురం: ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటించాలని చేసిన ఆందోళన ఫలితంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అభినందనీయం అన్నారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం 90 రోజులు సమయం కావాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండాలనే అభ్యర్థుల అభ్యంతరాలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని కోరారు. ఎప్పుడు లేని మార్కుల పర్సంటేజ్‌ని తీసుకువచ్చారని అన్నారు. ఇప్పటి వరకు అభ్యర్థుల అభ్యంతరాలపై మాట్లాడకపోవడం చూస్తే మంత్రికి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుందని చెప్పారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ స్పందించి వారి అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ అభ్యర్థుల అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే వారితో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు పి.భార్గవ్, పి.బాషా, ఎం.ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నదిలో దూకి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ పైనుంచి ఓ వ్యక్తి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానది సీతానగరం వైపు ప్రకాశం బ్యారేజ్ 6వ ఖానా వద్ద శనివారం రాత్రి ఓ యువకుడు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణానది నీటి స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన గేటుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉంటుంది. మృతుడి శరీరంపై నల్ల జీన్స్ ఫ్యాంట్, నల్లని చొక్కా ధరించి ఉన్నాడు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే 8008443915 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్‌ఐ కోరారు.

డీఎస్సీపై అభ్యర్థుల అభ్యంతరాలను పరిష్కరించాలి