
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
శావల్యాపురం: హత్య కేసులో నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ లేళ్ల లోకేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా...మండలంలోని శానంపూడి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అమృతపూడి నాగేశ్వరరావు (36) గతేడాది అక్టోబరు 7వ తేదీన కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మృతుడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో మృతుడు, వినుకొండ మండలం ఎనుగుపాలెం గ్రామానికి చెందిన దావులూరి వీరబ్రహ్మం కలసి మండలంలోని కారుమంచి గ్రామం అద్దంకి బ్రాంచ్ కెనాల్ కట్టపై అక్టోబరు 7వ తేదీన రాత్రి మద్యం తాగుతున్న సమయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతుడు నాగేశ్వరరావును, వీరబ్రహ్మం కాల్వలోకి తోసి పరారయ్యాడు. మార్టూరు సమీపంలో వలపర్ల కొమ్మినేనివారిపాలెం టి.జంక్షన్ వద్ద మృతదేహం లభ్యమైంది. అప్పట్లో మార్టూరు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనంతరం కేసును శావల్యాపురం పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దావులూరి వీరబ్రహ్మంను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.
రైల్వే గ్యాంగ్‌మెన్ ఆత్మహత్య
సత్తెనపల్లి: రైల్వే గ్యాంగ్‌మన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్న షేక్ మస్తాన్‌వలి (59) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో మెడ, చేతికి బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడికి భార్య కరీమూన్, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కరీమూను ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో జీవిత ఖైదు
నరసరావుపేటటౌన్: వ్యక్తిని దారుణంగా హతమార్చటంతోపాటు రూ.380 నగదును దోపిడీ చేసినట్లు నేరం రుజువవడంతో నిందితుడు పట్టణానికి చెందిన తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పందికి జీవిత ఖైదు, రూ.15 వేలు జరిమానా విధిస్తూ స్థానిక 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2023వ సంవత్సరం మే నెల 9వ తేదీ రాత్రి పట్టణంలోని గాంధీ పార్క్ ఎదుట గల బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్న 55 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడు ఇటుకరాయితో మోది దారుణంగా హతమార్చాడు. అతని వద్ద నుంచి కొంత నగదు తస్కరించాడు. సంఘటన జరిగిన మరుసటి రోజు 18వ వార్డు వీఆర్వో చల్లా చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అంకమ్మరావును అరెస్టు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం అప్పటి సీఐ ఎ.అశోక్‌కుమార్ కోర్టులో అభి యోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో హత్య కేసులో జీవిత ఖైదు, రూ.10000 జరిమానా, దోపిడీ కేసులో పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించారు. శిక్షను ఏకకాలంలో అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ఏపీపీ దేశిరెడ్డి మల్లారెడ్డి నిర్వహించారు. నిందితుడు అంకమ్మరావు పలు హత్య, చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

హత్య కేసులో నిందితుడికి రిమాండ్