చీపురుపల్లి: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్‌గా నిలవడానికి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్‌గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి టాపర్‌గా నిలిచింది. అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి.
వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మానస మెరిట్ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్‌డీ చేస్తోంది. ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment