వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

Published Wed, Jan 10 2024 2:18 AM | Last Updated on Wed, Jan 10 2024 2:18 AM

మెరకముడిదాం: వాసు మృతదేహం - Sakshi

మెరకముడిదాం: వాసు మృతదేహం

వీరఘట్టం: మండలంలోని విక్రమపురం గ్రామంలో గల వావిలపల్లి వెంకటనాయుడుకు చెందిన ఇటుక బట్టీలో మంగళవారం ఉదయం ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ ముచ్చి వంశీ(20) అక్కడికక్కడే మృతిచెందాడు. నాలుగేళ్లుగా తల్లిదండ్రులు సింహాచలం, గౌరీశ్వరిలతో కలిసి ఇదే బట్టీలో ఇటుకలు తయారీ చేస్తూ, ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు.ఇటుకల తయారీ కోసం కావాల్సిన మట్టిని వీల్‌ ట్రాక్టర్‌తో బాగా దుక్కిపట్టి తర్వాత ఆ మట్టితో ఇటుకలు తయారు చేస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా వీల్‌ ట్రాక్టర్‌తో మట్టిని దుక్కిపడతారు. ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం 7.30 గంటలకు మట్టిని దుక్కిపట్టేందుకు వీల్‌ ట్రాక్టర్‌ను వంశీ డ్రైవింగ్‌ చేశాడు. ఈ క్రమంలో సర్కిల్‌లో రౌండ్లు తిరుగుతుండగా ఒక్కసారిగా వీల్‌ట్రాక్టర్‌ బోల్తా పడగా ట్రాక్టర్‌ క్రింద డ్రైవర్‌ వంశీ ఉండిపోయి ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలు విడిచాడు. వెంటనే జేసీబీ సాయంతో వీల్‌ ట్రాక్టర్‌ను పక్కకు నెట్టి వంశీని బయటకు తీశారు. అప్పటికే చనిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామం కడకెల్లకు తరలించారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.గోవింద తెలిపారు.

ట్రాక్టర్‌పై నుంచి పడి మరొకరు..

మెరకముడిదాం: మండలంలోని ఉత్తరావల్లి సమీపంలో ట్రాక్టర్‌తో వెళ్తున్న చొక్కాపు వాసు (33) వ్యక్తి ట్రాక్టర్‌పై నుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలాఉన్నాయి. బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన చొక్కాపువాసు ఉత్తరావల్లి గ్రామంలో బంధువుల వ్యవసాయపనుల నిమిత్తం సోమవారం ట్రాక్టర్‌ను తీసుకువచ్చాడు. ఆ పనులు ముగించుకుని మంగళవారం తిరిగి తన గ్రామానికి బయలుదేరి వెళ్తుండగా ఉత్తరావల్లి గ్రామం సమీపంలోనే ఏం జరిగిందో తెలయదు కానీ ట్రాక్టర్‌ రోడ్డుపక్కన పడి ఉంది. డ్రైవింగ్‌ చేస్తున్న వాసు ట్రాక్టర్‌ పడిపోయిన ప్రదేశానికి కొన్ని అడుగుల ముందు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతునికి భార్య అనసూయ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్సై సీహెచ్‌ నవీన్‌పడాల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చెరువులో పడి మహిళ..

భోగాపురం: మండల కేంద్రంలోని సంతోషిమాత ఆలయ సమీపంలో ఉన్న చెరువులో పడి ఓ మహిళ మంగళవారం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భోగాపురానికి చెందిన పాండ్రంగి కొండమ్మ(53) కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం వేకువజామునే లేచి కాలకృత్యాలకని చెప్పి సంతోషిమాత ఆలయ సమీపంలో ఉన్న చెరువు వద్దకు ఆమె వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులోపడి మృతిచెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి భర్త కొండలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై టీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు.

బైక్‌ ఢీకొని యువకుడు..

రామభద్రపురం: మండలకేంద్రంలో బైపాస్‌ రోడ్డు వద్ద స్కూటీని బుల్లెట్‌ ఢీకొనడం ఓ యువకుడు మంగళవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలోని పెదపల్లి వీధికి చెందిన పెదపల్లి భాస్కరరావు(27) మంగళవారం ఉదయం పని నిమిత్తం బైపాస్‌ జంక్షన్‌కు స్కూటీపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంతలో విశాఖపట్నానికి చెందిన వ్యక్తులు ఒడిశా నుంచి మితిమీరిన వేగంతో బుల్లెట్‌పై విశాఖపట్నం వెళ్లిపోతూ లారీని క్రాస్‌ చేస్తుండగా స్కూటీని బలంగా ఢీకొట్టాడు. దాంతో స్కూటీపై ఉన్న భాస్కరరావు తుళ్లిపోయి డ్రైనేజీ కోన్‌కు తలతగిలి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్నేహితులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం చేశారు. మృతుడి భార్య జ్యోత్స్న ఫిర్యాదు మేరకు ఏఎస్సై చిన్నయ్య కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భాస్కరరావు మృతదేహం1
1/2

భాస్కరరావు మృతదేహం

డ్రైవర్‌ వంశీ మృతదేహం2
2/2

డ్రైవర్‌ వంశీ మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement