బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామ పంచాయతీ శివారు గ్రామం బంకురు వలస వద్ద అక్రమంగా మాంగనీస్ తవ్వకాలు చేస్తూ తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎటువంటి లైసెన్స్ లేకుండా తవ్వకాలు చేపడుతూ గ్రేడింగ్ చేసి తరలిస్తున్నారంటూ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఆర్‌డీఓ రామ్మోహనరావుకు కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరపాలని తాహసీల్దార్ ఎం శ్రీనును ఆర్‌డీఓ ఆర్‌ఐ రామకుమార్ ఆదేశించగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది క్వారీ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. గతంలో ఇక్కడ మాంగనీసు ఓర్ తవ్వకాలకు అనుమతులున్నా తదనంతరం అక్కడి తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో తవ్వకాలు నిలిపివేసినట్లు యజమాని ఫారూఖ్ తెలియజేశారు. గతంలో తవ్వి ఉంచిన మాంగనీసు కుప్పల్లో గ్రేడింగ్ చేసి మాంగనీసును తరలించేందుకు తమకు అనుమతులున్నాయని, తవ్వకాలు చేపట్టడం లేదని వివరించారు. అలాగే ప్రతి ఏడాది రూ.10వేలు ప్రభుత్వానికి చలానా ద్వారా చెల్లించి గ్రేడింగ్ చేసుకుంటున్నట్లు చెప్పడంతో రెవెన్యూ సిబ్బంది నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. మంగళవారం విలేకరులు సంబంధిత ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా మాంగనీసును గ్రేడింగ్ చేస్తున్న దాదాపు 50 మంది కూలీలు అక్కడ పనిచేస్తూ కనిపించారు.
కేవలం గ్రేడింగ్‌కు అనుమతి
మాంగనీసు గ్రేడింగ్ తరలింపుపై తహసీల్దార్ ఎం.శ్రీనును వివరణ కోరగా గతంలో అక్కడ ప్రభుత్వ అనుమతితో మైనింగ్ జరిగిందన్నారు. ప్రస్తుతం తవ్వకాలకు అనుమతి లేదని, కేవలం గ్రేడింగ్ చేసి తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని తెలియజేశారు.