అప్రమత్తంగా లేకుంటే అక్షయం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా లేకుంటే అక్షయం

Mar 24 2025 6:42 AM | Updated on Mar 24 2025 11:27 AM

క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన

వెంటనే కఫం పరీక్ష చేయించాలి

60 ఏళ్లు దాటిన వారు, పొగ తాగేవారికి పరీక్ష అవసరం

100 రోజుల క్షయ కార్యక్రమంలో 861 కొత్త కేసులు గుర్తింపు

నేడు ప్రపంచ క్షయ దినోత్సవం

విజయనగరం ఫోర్ట్‌: ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి క్షయ. క్షయ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. క్షయ వ్యాధిని గుర్తించి 6 నెలల పాటు మందులు వాడడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అయితే వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారికి ప్రాణాలు మీదికి వస్తుంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు.

వ్యాధి లక్షణాలు:

రెండు వారాలకు మించి దగ్గు, రెండు వారాలకు మించిన జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండటం, మెడ వద్ద వాపులు క్షయ వ్యాధి లక్షణాలు. మైక్రో బాక్టీరియా చుబర్‌క్యూలోసిస్‌ అనే బాక్టీరియా వల్ల గాలి ద్వారా ఈ వ్యాప్తి చెందుతుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, సురక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులను పూర్తి కాలం పాటు వాడాలి. సాధారణ క్షయ వ్యాధికి 6 నెలల పాటు, మధ్యలో మానివేసి తిరిగి ప్రారంభిస్తే 8 నెలల పాటు, మొండి క్షయ వ్యాధికి రెండేళ్ల పాటు మందులు వాడాలి. అలా కాకుండా మందులను మధ్యలో మానివేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యవాత పడే ప్రమాదం ఉంది.

క్షయ పరీక్ష చేసుకోవాల్సిన వారు:

60 ఏళ్లు దాటిన వారు, సుగర్‌ వ్యాధి గ్రస్తులు, మద్యం, పొగతాగేవారు. గతంలో క్షయ వ్యాధి మందులు వాడిన వారు, క్షయ వ్యాధి మందులు వాడిన వారి కుటుంబసభ్యులు, ఎత్తుకు తగ్గ బరువు లేని వారు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.

861 కేసులు గుర్తింపు:

జిల్లాలో 100 రోజుల టీబీ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్‌ 7 నుంచి మార్చి 23 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,59,899 మందిని స్క్రీనింగ్‌ చేసి 43,413 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. 33, 637మందికి ఎక్స్‌రే తీయగా 861 క్షయ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement