డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రయత్నం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాను డోలీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడికి తెలిపారు. రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆయన జిల్లా ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉందని, కొండ ప్రాంతాల్లో రహాదారి సదుపాయం లేక డోలీలు వినియోగిస్తున్నారని, ఆ పరిస్థితి కనిపించకుండా ఉండేలా రహదారి సదుపాయం కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 250 మంది ప్రజలున్న ఆవాసాలకు కూడా రహదారి సదుపాయం కల్పించాలనే దిశగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అపరాల సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని తాన్ని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం రూ. 1.67 లక్షలుగా ఉందని దాన్ని వచ్చే 2025–56 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.94 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రగతికి పర్యాటరంగం ఎంతో దోహదపడుతుందని, పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించామని వివరించారు. జిల్లాలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజి నిర్మాణం 60 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు.
కందుల సాగుకు ప్రోత్సాహం
తలసరి ఆదాయం పెంచే దిశగా చర్యలు
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్