ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సంతకాల సేకరణ
బొబ్బిలి: తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయమై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు స్థానిక పట్టణంలోని పారిశుధ్య కార్మికులతో సంతకాల సేకరణ గురువారం చేపట్టారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారి సేవలను గుర్తించాలని శంకరరావు కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వారిని పొగడడం కాదని వారి పట్ల చిత్తశుద్ధి నిబద్దత ఉంటే వారిని శాశ్వత ఉద్యోగులను చేయాలన్నారు. ఆప్కాస్ వంటి ప్రైవేటు ఏజెన్సీకి తమ ఉద్యోగాల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌లు కలిగిన వినతిపత్రాన్ని మున్సిపల్ శాఖామంత్రి నారాయణకు కూడా పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జి.గౌరి, జె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ
బొబ్బిలి: దైవ సేవకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను నిరసిస్తూ క్రైస్తవులంతా స్థానిక పట్టణంలోని సీబీఎం చర్చి ఆవరణలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ గురువారం చేపట్టారు. దైవసేవకుడి హత్య వెనక ఉన్న నిందితులను తక్షణమే గుర్తించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ క్రైస్తవ సమాజంపై దాడులు పెరుగుతున్నాయని, లౌకిక దేశంలో ఇలాంటి దుర్ఘటనలు దురదృష్టకరమన్నారు. అనంతరం పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో వేణు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సంతకాల సేకరణ