ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని సీహెచ్ బొడ్డవలస పంచాయతీ పరిధి కేశాయవలస గిరిజన గ్రామంలో టేకు మొక్కలకు నీళ్లుపోస్తున్న వాటర్ ట్యాంకు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాశీపేట గ్రామానికి చెందిన పెదిరెడ్డి పోలిరాజు(58)మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కేశాయవలస గ్రామానికి చెందిన కొండగొర్రె నీలమ్మ పొలంలో టేకు మొక్కలకు నీళ్లు పోసేందుకు వాటర్‌ట్యాంకర్‌తో వెళ్తున్న పోలిరాజు పొలంలో ఎత్తుపల్లాలను గమనించకపోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో పోలిరాజు ట్రాక్టర్ కింద పడగా అక్కడికక్కడే మృతిచెందాడని సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. మృతుడి కుమారుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించామని సీఐ తెలిపారు.మృతుడు పోలిరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి..
భామిని: మండలం పసుకుడికి చెందిన ఇంటర్‌మీడియట్ విద్యార్థి మువ్వల జయరాం(18) శుక్రవారం శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జయరాం ఇంటర్‌మీడియట్ సెకెండియర్ పరీక్షలు భామినిలో రాశాడు. పరీక్షల అనంతరం సరదాగా గడుపుతున్న జయరాం ఈ నెల 2న పసుకుడి నుంచి లివిరి డోలోత్సవ యాత్రకు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంజరిగి తీవ్రగాయాలపాలయ్యడు. వెంటనే 108 అంబులెన్సు లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించి శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు ఆద్వర్యంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. పసుకుడిలో జరిగిన అంతిమ సంస్కారంలో తోటి విద్యార్థులు, టీచర్లు, బంధువులు పాల్గొని జయరాంకు ఘనంగా నివాళులు అర్పించారు.
అనుమానాస్పద స్థితిలో యువతి..
సాలూరు రూరల్: మండలంలోని మర్రివానివలస గ్రామానికి చెందిన వాకాటి ఐశ్వర్య (20) చీపురువలస గ్రామసమీపంలో మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం విశాఖపట్నంలోని ఒక బట్టల షాపులో పనిచేస్తున్న ఆమె ఇటీవల ఇంటికి వచ్చి రెండురోజుల క్రితం పనికి వెళ్లింది. శుక్రవారం చీపురువలస గ్రామసమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి వ్యక్తి మృతి
ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి వ్యక్తి మృతి